NewsTelangana

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు

 

తెలంగాణ ఎమ్మెల్యేల ఎర కేసులో నర్సాపురం ఎంపీకి సిట్ నోటీసులు ఇచ్చింది. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అక్రమాస్తులపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బుధవారం సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె. రఘురామకృష్ణంరాజును విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణంరాజుకి సంబంధించిన అనేక విషయాలను సిట్ సేకరించినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో నిందితులను ఎంపీ కలిశారని, ప్రధాన నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌లతో ఎంపీ ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన రఘు రామ కృష్ణంరాజు పాత్ర గురించి కూడా సిట్ వద్ద సమాచారం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. కేసులో రఘురామరాజు పాత్రను నిర్ధారించడానికి సిట్ ముందు హాజరుకావాలని నోటీసులు పంపించారు. నవంబర్ 26న హైదరాబాద్‌లో సిట్ ముందు రఘురామ హాజరుకావాల్సి ఉంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఎంపీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, నోటీసులపై ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. ఇప్పటికే నిందితుడు నందకుమార్ భార్య చిత్ర లేఖ, నందకుమార్ సహచరుడుగా పేర్కొంటున్న న్యాయవాది ప్రతాప్ గౌడ్‌లను కూడా సిట్ విచారణకు పిలిచింది. చిత్ర లేఖ, ప్రతాప్ గౌడ్‌లను నవంబర్ 25న సిట్ ముందు రావాల్సి ఉంది. మరోవైపు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీ అనే ముగ్గురు నిందితులను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ బుధవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.