ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస పూజలు ప్రారంభం
మహిళలంతా ఎపుడెపుడా అని ఎదురుచూసే పండుగల శ్రావణమాసం రానే వచ్చింది. లక్ష్మీ పూజల సందడి మొదలైపోయింది. ఈసందర్బంలో అమ్మలగన్నఅమ్మ ముగురమ్మల మూలపుటమ్మ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పూజల హడావిడి ప్రారంభమైంది. మహాభారతంలో అర్జనుడు ఆ కొండపై తపస్సు చేసిన కారణంగా అతని పేరును జోడించి విజయదుర్గగా నీరాజనాలందుకొనే ఆచల్లనితల్లి కరుణాకటాక్ష వీక్షణాల కోసం భక్తకోటి విజయవాడకు పరుగులు తీస్తున్నారు. ఇక్కడ అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండడం చేత ఆమెకు కనకదుర్గ అనే నామం స్థిరపడింది. అర్ధనారీశ్వరుడైన పరమేశ్వరుడు కూడా అమ్మవారితో పాటు మల్లికార్జున నామంతో ఇక్కడ వెలిసాడు. ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణపుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం వంటి ప్రధానపూజలు ప్రతిరోజూ జరుగుతూ ఉంటాయి. శ్రావణమాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతీ శరన్నవరాత్రులకు దసరా పర్వదినాలలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
ఈరోజు శ్రావణమాసం మొదటిరోజు కావడం, పైగా శుక్రవారం రావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని లక్ష్మీదేవి అలంకారంలో ఉంచి శ్రావణమాసం పూజలు ప్రారంభించారు. శ్రావణమాసం సందర్బంగా ఈసారి 4వ శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరగబోతున్నాయని ఆలయ ధర్మకర్తలు చెప్పారు. ఈ వ్రతాలకు ఆగస్టు15 నుంచి ఆధార్ కార్డుతో ఆలయంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈటికెట్ ధర 1500 రూపాయలుగా నిర్ణయించారు. విజయవాడకు రైలు, రోడ్ మార్గాలలో చేరుకోవచ్చు. మనమూ ఆ సంబరాన్ని తిలకిద్దామా…