InternationalNews

థాయ్‌లాండ్‌లో ప్రీ స్కూల్‌లో కాల్పులు.. 34 మంది మృతి

థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. ప్రీ స్కూల్‌ డే కేర్‌ సెంటర్‌పై ఓ దుండగుడు దాడి చేసి 34 మందిని పొట్టన పెట్టుకున్నాడు. లంచ్‌ టైమ్‌లో ఐదుగురు సిబ్బందిని తుపాకితో కాల్చి డే కేర్‌ సెంటర్‌లోకి ప్రవేశించిన దుండగుడు గదిలో లంచ్‌ చేస్తున్న చిన్నారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 23 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు, ఒక పోలీసు అధికారి, ఇతరులు చనిపోయారు. థాయ్‌లాండ్‌లోని నాంగ్‌బువా లాంపు నగరంలో 34 ఏళ్ల పాన్య కమ్రాబ్‌ అనే ఓ మాజీ పోలీస్‌ అధికారి ఈ ఘాతుకానికి పాల్పడటం విశేషం. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారుల మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.

మృతుల్లో 8 నెలల గర్భిణీ కూడా ఉండటం బాధాకరం. కాల్పులు జరిపిన తర్వాత ఓ ట్రక్కు ఎక్కి పారిపోయిన నిందితుడు అనంతరం తన భార్యాపిల్లలను కాల్చి చంపి.. తాను కూడా కాల్చుకుని చనిపోయాడని థాయ్‌ మీడియా తెలిపింది. మారక ద్రవ్యాలకు అలవాటు పడిన ఆ దుండగుడిని ఏడాది క్రితమే ఉద్యోగం నుంచి తొలగించారు. థాయ్‌లాండ్‌లో ఇలాంటి సామూహిక కాల్పుల ఘటనలు జరగడం అరుదు. 2020లో నఖోమబా రాట్చెస్మా నగరంలో ఓ సైనికుడు 21 మందిని కాల్చి చంపిన తర్వాత ఇదే తొలి ఘటన.