సమస్యలు వినే ఓపిక లేదు కానీ..ఓటు మాత్రం కావాలా?
గత కొన్ని రోజులుగా ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని శెట్టిపల్లి తండాలో శనివారం ఉదయం ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ ఆ ప్రాంతానికి వెళ్ళారు. అయితే అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటి ముందుకొచ్చిన శంకరనారాయణను ఒక మహిళ కడిగి పారేసింది. ఆ గ్రామానికి చెందిన లలితబాయి అనే మహిళ తనకు గత 11 నెలలుగా పింఛన్ నిలిపివేశారని ఆమె ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్మబాయి అనే మరో మహిళ తనకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా ఆ గ్రామంలోని మరి కొంతమంది మహిళలు తమకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో తమ సమస్యలు చెప్తున్న పట్టించుకోకుండా ఎమ్మెల్యే వెళ్ళి పోతున్నారని ప్రజల సమస్యలు వినే ఓపిక లేదా? అని ఒక మహిళ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.