హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాక్ ..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. అదేంటంటే ఈ బ్యాంకులో డిపాజిట్‌పై వడ్డీరేట్లను గణనీయంగా తగ్గిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఐసీఐసీఐ బ్యాంక్ బాటలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం డిపాజిటర్లకు డబుల్ షాక్ ఇచ్చినట్లయింది. రేట్ల తగ్గింపు తర్వాత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ పౌరులకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను కనీసం 2.75 శాతం నుంచి గరిష్టంగా 6.60 శాతం వరకు అందిస్తోంది. ఇదివరకు ఈ రేట్లు 3 శాతం నుంచి 6.85 శాతం వరకు ఉండేవి. సీనియర్ సిటిజెన్లకు చూస్తే కనీసం 3.25 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. గతంలో ఇది 3.5 శాతం నుంచి 7.35 శాతం వరకు ఉండేది. ముఖ్యంగా రూ. 3 కోట్లకు లోపు డిపాజిట్లపై, అన్ని టెన్యూర్లలోనూ FD వడ్డీ రేట్లను బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్థిక కార్యకలాపాల వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం, ప్రస్తుతం డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేవారికి తక్కువ రాబడిని ఇవ్వనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. ఇటీవల కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో (6 శాతం నుంచి 5.5 శాతానికి), బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి.

