Breaking Newshome page sliderHome Page SliderTelangana

తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లోని లోక్ భవన్‌లో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. రాష్ట్ర గవర్నర్‌గా తన బాధ్యతలను అత్యంత శ్రద్ధతో, నిష్టతో నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో వందేమాతరం, ముగింపులో జనగణమన గీతాలను ఆలపించారు.ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, సీఎస్ శాంతి కుమారి , టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా సేవలందించిన జిష్ణుదేవ్ వర్మను రాష్ట్రపతి మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో నియమితులైన శివప్రతాప్ శుక్లా.. ఇకపై తెలంగాణ రాజ్యాంగ అధిపతిగా వ్యవహరించనున్నారు. నూతన గవర్నర్ నియామకంతో రాష్ట్ర పాలనలో కీలకమైన రాజ్యాంగ ప్రక్రియలు మరింత వేగవంతం కానున్నాయి.