టిప్పర్ డ్రైవింగ్‌తో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన శింగనమల వైసీపీ అభ్యర్థి
ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నామినేషన్లు దాఖలు చేస్తుంటే తాజాగా వైసీపీ శింగనమల అభ్యర్థి రూటే సెపరేట్ అని నిరూపించారు. నామినేషన్ వేయడానికి ఆయన టిప్పర్ నడుపుతూ వచ్చి దాఖలు చేశారు. ఇటీవల శింగనమల ఎన్నికల ప్రచారంలో వైసీపీ టిప్పర్ డ్రైవర్ ను అభ్యర్థిగా నిలబెట్టిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించడంతో, వైసీపీ ఆ అవకాశాన్ని సైతం తమకు అనుకూలంగా మలచుకుంటోంది. ఆయా అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వినూత్న పోకడలతో ముందడుగేస్తుంటే వైసీపీ నేత వీరాంజనేయులు టిప్పర్ నడుపుతూ, కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున వీరాంజనేయులు పోటీ చేయడం సంచలనం కలిగించింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన శింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి జగన్ టికెట్ నిరాకరించారు. వీరాంజనేయులుకు జగన్ అవకాశం ఇచ్చారు. వీరాంజనేయులు తండ్రి గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్న వీరాంజనేయులుకు పార్టీ అవకాశం ఇచ్చింది. గతంలో జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి వద్ద వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్‌గా పనిచేశారు. అయితే టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అవమానిస్తునన్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఆటో డ్రైవర్లకు ఏటా పది వేలు ఇస్తున్నట్టుగానే వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత సొంత టిప్పర్ ఉన్నవారందరికీ ఇస్తానంటూ జగన్ శింగనమలలో భరోసా ఇచ్చారు.

