Home Page SliderNational

“ఆమె ప్రజలు తోలుబొమ్మలనుకుంటోంది”…సీఎంపై తీవ్ర ఆరోపణలు

ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగి నెలకావస్తున్నా బెంగాల్ చల్లబడలేదు.  ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బెంగాల్ ప్రజలనుద్దేశించి సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ, ప్రజలంతా రాబోయే దుర్గాపూజపై దృష్టి పెట్టాలని కోరారు. డాక్టర్లు విధులకు హాజరు కావాలని, రాత్రిపూట ఆందోళనలు మానుకోవాలని ఈ కేసును సీబీఐ త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తాము ఎలాంటి పండుగలు సెలబ్రేట్ చేసుకోలేమని వాపోయారు. సీఎం ఇంట్లో ఇలా జరిగితే ఆమె పండుగ చేసుకుంటుందా? అంటూ ప్రశ్నించారు. తమ కుమార్తెను కోల్పోయామని, ఆమెను తిరిగి తెచ్చిస్తే పండుగ చేసుకుంటామన్నారు. తమకు అండగా నిలిచి పోరాడుతున్న వైద్యులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సువేందు అధికారి మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి ప్రజలను తోలుబొమ్మలుగా భావిస్తోందని’ మండిపడ్డారు. దుర్గాపూజ మొదలుకాబోతోంది. కానీ ఇంకా రాక్షసులు అంతం కాలేదన్నారు. మహాశక్తి మేల్కొంటోందని, రాక్షసులను అంతం చేస్తుందని, ఓపిక పట్టాలని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.