ఏడుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు
ఏపీలో 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 మంది బీసీలకు పదవులు లభించాయని ఇదే సీఎం వైయస్ జగన్ సోషల్ ఇంజినీరింగ్ అని ,అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపికలోనూ కనిపించిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర శాసనమండలిలో ఈ నెలాఖరుకు ఖాళీ అవుతున్న ఎమ్మెల్యేల కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు వెలగపూడి లోని శాసనమండలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మొదటి నుంచి సామాజిక న్యాయం అనేది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ విధానంగా మనసా వాచా కర్మణా చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నామని ఇప్పుడు పోటీ జరుగుతున్న 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు ఇవ్వగా.. అందులో 11 స్థానాలు బీసీలకు కేటాయించడమనేది ఒక చరిత్రాత్మక విషయంగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన సామాజిక న్యాయాన్ని దేశమంతా గమనించిందని ఆ రోజు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని ఆచరణలో ముందున్నామని గర్వంగా చెబుతున్నమని అన్నారు.
శాసనమండలిలో ఇప్పటికే మైనార్టీలు నలుగురు ఉన్నారనీ ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవాలని ఈ నామినేషన్ల ప్రక్రియ అంతా పూర్తయ్యాక.. శాసనమండలిలో మొత్తం 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 10 స్థానాలు గ్రాడ్యుయేట్లు, టీచర్ల నుంచి ఎన్నికను పక్కన బెడితే, మిగిలిన 48 స్థానాల్లో టీడీపీ బలం 4కు పడిపోయిందని,  వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన 44 మందిలో 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభ్యులు ఉండబోతున్నారని ఇదొక చరిత్రాత్మక పరిణామమని సజ్జల అన్నారు. రాజకీయ సాధికారత దిశగా నామినేటెడ్ పదవులు మొదలు ఎన్నికయ్యే పదవుల వరకు ఎక్కడ అవకాశముంటే అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేయడంలో సీఎం జగన్ చూపుతున్న విప్లవాత్మక చొరవ ప్రజల మన్ననలు పొందుతోందోని మాటల్లో కాదు చేతల్లో చూపుతారనే విషయం ప్రపంచానికి చాటింది జగన్  సర్కారని అన్నారు.
మొన్నటిదాకా అధికారాన్ని వెలగబెట్టిన తెలుగుదేశం పార్టీ ఇవన్నీ ఎందుకు చేయలేక పోయిందని దీన్నే మేం ప్రశ్నిస్తున్నామని బీసీలంతా తమ హక్కు అంటూ వాళ్లను ఓట్ బ్యాంక్‌గా పరిగణించిన టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. దీనికి సమాధానం చెప్పాలని  సజ్జల ప్రశ్నించారు.  2019 ఎన్నికల నుంచి మొదలైన ఈ సామాజికవర్గ విప్లవాత్మక చరిత్ర మూడున్నరేళ్లుగా ప్రజలంతా చూస్తున్నారని భవిష్యత్తులో మరింత మెరుగైన పరిస్థితిని చూస్తారని ముఖ్యమంత్రి జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే కాకుండా.. అవకాశం ఉన్న ప్రతి చోటా మహిళలకు 50 శాతం రాజకీయ సాధికారత కల్పించే దిశగా నడిచేందుకు తామంతా కృత నిశ్చయంతో ఉన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

