ఏపీలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల
ఏపీలో మరో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, 8 స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నిక కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ నెల 27 నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు మార్చి 13న పోలింగ్ జరగనుంది. మార్చి 16 కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం నెల్లూరు చిత్తూరు నియోజకవర్గతో పాటుగా కడప అనంతపురం కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి షెడ్యూలు విడుదల అయింది.

ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం సభ్యులుగా ఉన్న బాల సుబ్రమణ్యం, కత్తి నరసింహారెడ్డి మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. అదేవిధంగా మూడు పట్టభద్రులు నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రకాశం నెల్లూరు చిత్తూరు ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి మార్చి 29న పదవీ విరమణ కానున్నారు. కడప అనంతపురం కర్నూలు ప్రస్తుత ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి కూడా అదే రోజున పదవి విరమణ చేయనున్నారు. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత మాధవ్ కూడా అదే రోజున పదవి విరమణ చేయాల్సి ఉంది. ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీలో నిలుస్తున్నారు. వీటితోపాటుగా 9 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

ఈ తొమ్మిది సీట్లు తెలుగుదేశం పార్టీ నేతలకు చెందినవే ఈ తొమ్మిది స్థానాల్లోనే ప్రస్తుత సభ్యుల్లో ఇద్దరు మార్చి 29న మరో ఏడుగురు మే ఒకటో తేదీన పదవీ విరమణ చేయనున్నారు. స్థానిక సంస్థల కోటాలో అనంతపురం నుంచి దీపక్ రెడ్డి, కడప నుంచి బీటెక్ రవి స్థానాల్లో ఎన్నిక జరగనుంది. నెల్లూరు నుంచి వాకాటి నారాయణరెడ్డి ,పశ్చిమగోదావరి నుంచి రామ్మోహనరావు, మంతెన వెంకట సత్యనారాయణ రాజు, తూర్పుగోదావరి నుంచి చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం నుంచి శత్రుచర్ల విజయరామరాజు, చిత్తూరు నుంచి రాజనర్సింహులు, కర్నూలు నుంచి కేఈ ప్రభాకర్ అదేరోజు పదవి విరమణ చేయనున్నారు. ఈ స్థానాలకు మార్చి 13న పోలింగ్ జరగనుంది. ఇవన్నీ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరే అవకాశం కనిపిస్తుంది.

