మేం బయటకు రాము -జైల్లోనే ఉంటాం
గుడ్డి కంటే మెల్ల మేలనుకుంటున్నారు రష్యాలో ఖైదీలు. రష్యా- ఉక్రెయిన్ యుద్ద నేపథ్యంలో రష్యా భారీస్థాయిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలను ప్రారంభించింది. పౌరులు తగినంత దొరకకపోవడంతో ఖైదీలపై పడింది. వారికి క్షమాభిక్ష పెడతామని, వాలంటీర్లుగా చేరేవారికి శిక్షలు రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్‌కి వారు ఎగిరిగెంతేసి ఒప్పుకుంటారని భారీస్థాయిలో వాలంటీర్లు చేరతారని ఊహించింది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఖైదీలు బిక్కుబిక్కుమంటూ మాకొద్దీ ఆఫర్ అంటున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్‌తో యుద్ధం రెండు, మూడు నెలల్లో ముగుస్తుందని రష్యా భావించింది. కానీ ఆరునెలలైనా ఆ దేశం ఒగ్గకపోవడంతో ఇంకెంతకాలం ఈ యుద్ధం జరుగుతుందో తెలియట్లేదు. నిజానికి ఇలా యుద్ధానికి ఖైదీలను వాడుకోవడం రష్యాకు కొత్తేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఈ పద్దతి పాటించింది. ఇటీవల సెయింట్ పీటర్స్ బర్గ్ పీనల్ కాలనీ కారాగారం నుండి వెళ్లిన 11 మంది వాలంటీర్లలో 8 మంది ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయారు. అందుకే వాలంటీర్లుగా చేరడానికి కేవలం 1500 మంది మాత్రమే దరకాస్తు చేసారు. చాలామంది బతికుంటే బలుసాకు తిన్నొచ్చని జైలులోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.