వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో హోరాహోరీ..
లోక్‌సభలో 14 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం రాజ్యసభకు చేరింది వక్ఫ్ బిల్లు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వక్ఫ్ పాలకవర్గాలలో జవాబుదారీతనం పెంచుతూ మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం సవరణలతో ప్రవేశపెట్టింది. గతేడాది కేంద్రం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, విపక్షాల నుండి వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలన కోసం పంపారు. ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలతో ప్రస్తుతం ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ స్పందిస్తూ సమాజంలో శాశ్వత విభజన కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇది రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లు ప్రతిని లోక్‌సభలో చించివేశారు. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. దీనితో మెజారిటీతో బిల్లు ఆమోదం పొందింది.

