ప్రారంభమైన రొట్టెల పండుగ…
మత సామరస్యానికి ప్రతీకగా బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ పండుగ ఏడాదికోసారి నిర్వహిస్తారు. 2015లో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈనెల 13వ తేదీ వరకు రొట్టెల పండుగ కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కుల మతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కోర్కెలు తీరాలంటూ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నెల్లూరు జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత రెండేళ్లుగా రొట్టెల పండుగను జరుపలేదు. దాంతో ఈ సారి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రొట్టెలను సమర్పిస్తున్నారు. ఆరోగ్య రొట్టె, ఐశ్వర్య రొట్టె, ఉద్యోగ రొట్టె, చదువు రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె… ఇలా వివిధ రొట్టెలను భక్తులు ఇతరులకు ఆశీర్వదించి ఇస్తుంటారు. కోర్కెలు తీరిన వారు తిరిగి బారా షహీద్ దర్గాను సందర్శించి రొట్టెలు పంచిపెట్టడం ఆనవాయితీ.