పాలకవర్‌కి పెట్రోల్ – భలే ఛాన్సులే
మీ ఇంట్లో ఖాళీ పాల పేకెట్లు, ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయా..ఐతే మీకు పెట్రోల్‌పై డిస్కౌంట్ రేటులో లభిస్తుంది. ఈమాట వింటే ఎగిరి గెంతేయాలనిపిస్తోంది కదా, కానీ మనకా అదృష్టం లేదు. ఓ పక్క పెట్రోల్ రేట్లు భగ్గుమంటుంటే, దానివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలిపోతుంటే ఇలాంటి ఆఫర్‌లు ఎవరు ఇస్తున్నారా అనే అనుమానం వస్తోంది కదా.. రాజస్థాన్‌లోని భిల్వారాలో అశోకుమార్ ముంద్రా అనే వ్యక్తి పెట్రోల్ బంకును నడుపుతున్నారు. ఆయన ప్లాస్టిక్ ఉత్పత్తులపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారు. భిల్వారా జిల్లా డెయిరీ కంపెనీ, కాలుష్య నియంత్రణ మండలి సహాయంతో ఆ ఆఫర్‌ను ప్రకటించారు. ఖాళీ పాలపేకట్లు ఇస్తే, పెట్రోల్,డీజీల్ ధరలపై రాయితీ ఇస్తామని వాహనదారులకు ఆఫర్ ఇచ్చారు. ఒక పేకెట్‌కు 1 రూపాయి పెట్రోల్‌పై, 50 పైసలు డీజిల్‌పై ఈ ఆఫర్‌ను ప్రకటించారు. ఇలా వచ్చిన పేకెట్లను, సీసాలను సరస్ డెయిరీకి ఇస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మనుషులకే కాకుండా జంతువులకు కూడా హానికరం.
ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు వీధి కుక్కలు, ఆవులు, మొదలైన జంతువుల కడుపుల్లో నిండి వాటికి ప్రాణాంతకమవుతున్నాయి. ఒకవేళ ప్లాస్టిక్ సముద్రంలో చేరినా కూడా సముద్రజీవులకు కూడా అది చాలా ప్రమాదకరం. ఇది భూమిలో, నీటిలో కరగకపోవడం, కలవకపోవడం వల్ల చేపలు, తిమింగలాలు, ఇతర సముద్రజీవులు వాటిని తిని చనిపోతున్నాయి. ప్రకృతి సుందరమైన ప్రదేశాలు కూడా ఈ ప్లాస్టిక్ వల్ల కలుషితమైపోతున్నాయి.
అందువల్ల ప్రజలకు, ప్రకృతికి మేలు చేసే ఉద్దేశంతో ఇలాంటి ఆఫర్ ఇచ్చినట్లు ముంద్రా తెలిపారు. ఇంకా ఇంధన పంపుల వద్ద రెడీమ్ చేసుకోగల కూపన్లను కూడా ఈ డెయిరీ సహాయంతో అందజేస్తున్నారు. ఎంతైనా ఈ ప్రకృతి ప్రేమికుడు అభినందనీయుడు కదా..