Andhra PradeshNews

రోడ్లు బాగు చేయండి.. సీఎం సార్ !

Share with

◆ అస్తవ్యస్తంగా ఆంధ్రప్రదేశ్ రోడ్లు
◆ నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు
◆ కనిపించని రోడ్లు.. అన్నీ గోతులే అంటున్న జనసేన
◆ గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరిట రెడీ అయిన జనసేన పార్టీ

ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో దారుణంగా ఉన్నట్లు సమాచారం. రోడ్ల మీద ప్రయాణించాలంటే నరకయాతన తప్పడం లేదని అనేకమంది ప్రజలు వాహనదారులు వాపోతున్నారు. ప్రభుత్వం కూడా రోడ్లు బాగోలేదని అంగీకరిస్తూనే దానికి గత ప్రభుత్వం కారణమని నిందలు వేస్తోంది. వర్షాకాలం మొదలు కావడంతోనే ఈ సమస్య మరింత జటిలమైందని ప్రజలు అంటున్నారు. రాష్ట్రమంతా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రయాణించాలంటే వెనకాముందూ చూసుకోవాల్సి వస్తోందని గర్భిణీలు, నడుంనొప్పి ఉన్న వాళ్లయితే రోడ్డెక్కపోవడమే ఉత్తమం అని గోతులు పడి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి ఉలుకూ పలుకూ లేదని ప్రజలు వాపోతున్నారు. తమ వాహనాలు పాడైపోతున్నాయని తప్పనిసరి పరిస్థితుల్లోనే రోడ్ల మీదకు వస్తున్నాం కానీ , తమ వాహనాల టైర్లు కూడ నాశనమయిపోతున్నాయని… కొన్ని చోట్ల అయితే 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు మరునాడు ఒళ్లునొప్పులతో బాధపడాల్సి వస్తోందని రోడ్లు అభివృద్ధి ప్రభుత్వం పని కాదా.. లేక మరచిపోయారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమానికి ఖర్చు చేస్తున్నట్టు చెప్పుకుంటోంది కానీ రోడ్లు బాగు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని వారు వాపోతున్నారు.

ప్రభుత్వాన్ని నిద్ర లేపుతాం : జనసేన

రోడ్లమీద ప్రయాణిస్తున్నప్పుడు ఒకటి అర గోతులు కనిపించటం సహజమని కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గోతులు మధ్య రోడ్డును వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. కొన్ని రహదారులు చూస్తుంటే స్విమ్మింగ్ పూల్స్ తలపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. రోడ్ల అభివృద్ధి కనీసం మరమ్మతులు చేయాల్సిన బాధ్యతను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వారి బాధ్యత గుర్తుచేయాలని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హష్ ట్యాగ్ తో ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమ పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కళ్లు తెరిపించడానికి ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టామని దెబ్బతిన్న రోడ్ల దుస్థితిపై తమ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో రోడ్ల దుస్థితి పై అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలు తీరుతాయో లేదా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.