NationalNews

జాతీయ పార్టీలకు వచ్చే విరాళాలపై కోవిడ్ దెబ్బ…

Share with

కరోన కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో దేశంలోని అనేక రంగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై కూడా… కోవిడ్ దెబ్బ గట్టిగానే పడింది. కోవిడ్ సమయంలో జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు సగం మేర తగ్గిపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు రూ. 420 కోట్ల మేర తగ్గినట్లుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 41.49% తగ్గాయి. బీజేపీకి 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 785.77 కోట్లు విరాళాలు రాగా,2020-21 సంవత్సరానికి 39.23% తగ్గి 477.54 కోట్లు విరాళాలు మాత్రమే వచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 139.01 కోట్లు విరాళాలు రాగా… 2020-21 సంవత్సరానికి 46.39% తగ్గి 74.52 కోట్లు మాత్రమే వచ్చాయి. జాతీయ పార్టీలకు ఆత్యధికంగా ఢిల్లీ నుంచి రూ. 246 కోట్లు విరాళాలు అందాయి. ఆ తర్వాత మహరాష్ట్ర నుంచి రూ. 71.68 కోట్లు, గుజరాత్ నుంచి రూ. 47 కోట్లు అందాయి. ఇక రూ. 39.91 కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయన్న వివరాలు అందుబాటులో లేవు. బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ,నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలు.. విరాళాల్లో 80 శాతాన్ని ఆక్రమించగా… మిగిలిన 20 శాతం చిన్న పార్టీలకు అందినట్టుగా ఏడీఆర్ నివేదిక సృష్టం చేసింది. మాయవతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీకి రూ.20 వేల కంటే ఎక్కువ రాలేదని చెప్పుకుంది. గత పదిహేనేళ్లుగా బీఎస్పీకి అంతకు మించి విరాళాలు అందడం లేదంటూ చెప్పడం విశేషం.