రేవంత్‌రెడ్డి తెలంగాణా చంద్రబాబు- డీకే అరుణ చురకలు
కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ, రాష్ట్రంలోనూ బలహీనపడిపోయిందని, దేశ ప్రజలందరూ బీజేపీ పక్షాన ఉన్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కక్షపూరిత రాజకీయాల కారణంగానే హుజురాబాద్‌లో ఉపఎన్నిక వచ్చిందని, ఇప్పుడు కూడా మునుగోడులో అదే రిపీట్ అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా… ఎక్కడ ఉపఎన్నిక జరిగితే అక్కడే కొత్తగా అమలు అవుతాయని ఎద్దేవా చేసారు.
రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరడానికి నిర్ణయించుకొనే నైతికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారని, ఆయన బీజేపీలో చేరడం రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తెలుగుదేశం నుండి గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దొడ్డిదారిన కాంగ్రెస్‌లో చేరిన చరిత్ర రేవంత్‌దే అని విమర్శించారు. తెలంగాణా చంద్రబాబుగా రేవంత్ తయారయ్యారన్నారు. అమిత్‌షాను గుజరాత్ నుండి బహిష్కరించడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టిందని రేవంత్ తెలుసుకోవాలనీ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక్కప్పుడు సోనియాను బలిదేవతగా అభివర్ణించాడనీ, ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినవాడిలా మాట్లాడుతున్నారని… అతని భాష మార్చుకోవాలని హెచ్చరించారు. ఈడీలు, సీబీఐ కేసులతో వేధించి ఎంతోమందిని జైలుకు పంపిన చరిత్ర కాంగ్రెస్‌దేననీ, సొంత ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ కాపాడుకోలేకపోతోందని విమర్శించారు. , హుజురాబాద్‌లో మాదిరే మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ కుమ్ముకయ్యాయన్న సంగతి రాష్ట్రపతి ఎన్నికల్లో ఋజువయ్యిందన్నారు. మునుగోడులో ఉప ఎన్నిక వస్తేనే ఆప్రాంతం అభివృద్ది జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని, బీజేపీపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు.