ముఖ్యమంత్రి పీఠంపై రేవంత్ రెడ్డి
కొడంగల్ వాసుల ఉత్కంఠకు తెరపడింది. మూడు రోజులుగా మా ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూసిన క్షణాలు దగ్గరపడ్డాయి. సీఎల్పీ నేతగా ఎనుముల రేవంత్‌రెడ్డి పేరు ప్రకటించగానే.. ఆ సెగ్మెంట్‌తో పాటు, వికారాబాద్ జిల్లా వాసులు ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు వీధుల్లోకొచ్చి బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఇదేసమయంలో అభివృద్ధి పరంగా నూతన ముఖ్యమంత్రిగా ముందు కొన్ని ఆకాంక్షలను ఉంచారు.
కొడంగల్.. ప్రస్తుతం ఏ నోట విన్నా ఈ పేరే వినబడుతోంది. రాష్ట్రస్థాయిలో మారుమోగుతోంది. అందుకు కారణం.. రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే హోదా నుండి ఒక్కో మెట్టు ఎక్కి టీపీసీసీ అధ్యక్షుడి స్థానానికి చేరుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చునే సమయం వచ్చింది. రాష్ట్రాన్ని పాలించబోతున్నారు.

