NewsTelangana

రేవంత్‌ నాటకాలు.. కవిత డ్రామాలు..

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నాటకాలకు, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత డ్రామాలకు ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం తెర దించిందని ఆరోపిస్తూ మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో తీగ లాగితే ప్రగతి భవన్‌, గాంధీ భవన్‌ వ్యాపార సంబంధాల డొంక కదిలిందంటూ సంచలన విషయం బయట పెట్టారు. కేసీఆర్‌ కుటుంబంతో రేవంత్‌ రెడ్డి చీకటి బంధం లిక్కర్‌ స్కాం ద్వారా బట్టబయలైందని, కవిత కంపెనీల్లో రేవంత్‌ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరూ కలిసి వ్యాపారం చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తన ట్విటర్‌ పోస్టులో తెలిపారు.

కవిత భర్తతో కలిసి రేవంత్‌ సెటిల్‌మెంట్లు..

కవిత భర్త అనిల్‌ రావుతో కలిసి రేవంత్‌ రెడ్డి పలు సెటిల్‌మెంట్లు కూడా చేశారని రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబంతో వ్యాపార బంధం బలపడటం వల్లే రేవంత్‌ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసు నిర్వీర్యం అయిందని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తాజా ట్వీట్‌లో రేవంత్‌రెడ్డితో పాటు కవితను, ఆమె భర్త అనిల్‌ రావును కూడా టార్గెట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై కవిత ఎలా స్పందిస్తారో చూడాలి. అంతేకాదు.. ప్రతి దసరాకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కవిత బతుకమ్మ సంబురాలు ఎక్కడ జరుగుతాయి? ఈడీ ఆఫీసులోనా..? సీబీఐ ఆఫీసులోనా..? లేక తీహార్‌ జైల్లోనా..? అంటూ రాజగోపాల్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.