సోనియా, రాహుల్ లకు ఊరట
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసును విచారణకు స్వీకరించేందుకు నిరాకరించిన ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే, ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా ఒక ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. గతంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియా స్వాధీనం చేసుకోవడంలో అక్రమాలు జరిగాయంటూ సుబ్రమణ్యస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ ఫిర్యాదుపై విచారణ కొనసాగించలేమని కోర్టు స్పష్టం చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోనియా, రాహుల్‌తో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి నేతలకు కూడా ఈ తీర్పుతో ఉపశమనం లభించింది.

