Home Page SliderNational

ఈశాన్యరాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల సందడి మొదలయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మార్చిలో అసెంబ్లీ గడువు ముగియనున్న మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. త్రిపురలో ఫిబ్రవరి 16, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఫిబ్రవరి 27న ఒకే ఒక్క విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్రఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. త్రిపురలో మార్చి 22 నాటికి శాసనసభ గడువు తీరిపోగా, నాగాలాండ్‌లో మార్చి 12 నాటికి, మేఘాలయలో మార్చి 15 నాటికి గడువు ముగియనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 2న మొదలవుతుంది. ఈ మూడు రాష్ట్రాలలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించి, ఎన్నికలపై స్థానిక యంత్రాంగం, పోలీసులు, అధికారుల అభిప్రాయాలను సేకరించింది.  ఈ మూడు రాష్ట్రాలలో 60 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మొత్తం 180 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

9125పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. త్రిపురలో బీజేపీ అధికారంలో ఉండగా, మేఘాలయ, నాగాలాండ్‌లలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కలిసి ఉంది. 80 శాతం పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నట్లు కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

వీటి అనంతరం ఈ ఏడాది 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణా రాష్ట్రాల శాసనసభల పదవీకాలం కూడా ఈ సంవత్సరంలో ముగియబోతున్నాయి. దీనితో దేశంలో ఎన్నికల బాజాలు మ్రోగనున్నాయి.