రెబల్స్ కొత్త పార్టీ శివసేన బాలాసాహెబ్ థాక్రే
మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయ్. శివసేన తిరుగుబాటు నేత ఎక్ నాథ్ షిండే ఒక్కో అడుగు వేస్తూ రాజకీయాలు చేస్తున్నాడు. తాజాగా శివసేన చీలిక వర్గానికి శివసేన బాలాసాహెబ్ థాక్రే పేరును ఖరారు చేశారు. ఎక్ నాథ్ షిండేకు ప్రస్తుతం 50 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని… వారిలో 40 మంది శివసేన నుంచే ఉన్నారని మీడియాలో గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయ్. ఓవైపు రెబల్స్, గౌహతి హోటల్‌లో ఉండగా… మహారాష్ట్రలో మాత్రం పరిణామాలు మారిపోతున్నాయ్… శివసేనపై తిరుగుబాటు చేయడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పూణెలో ఇవాళ ఎమ్మెల్యే తనాజి సావంత్ కార్యాలయాన్ని శివసైనికులు ధ్వంసం చేశారు. ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకొస్తుండటంతో రెబల్ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. తాజాగా పోలీసులు ముంబైలో 144 సెక్షన్ విధించారు. 16 మంది ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించారని… తనకు కూడా సెక్యురిటీని తీసేశారంటూ షిండే ట్వీట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపు అంటూ విమర్శించారు. ఐతే ఎవరికి భద్రత తొలగించలేదంటూ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.