ఘర్ వాపసీ ప్రచారంపై ఈటల స్పందన
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి టీఆర్‌ఎస్ గూటికి చేరుతారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. `ఘర్ వాపసీ’ అంటూ ఈటల ఫోటోతో సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ ప్రచారంపై ఈటల రాజేందర్ స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కమలం పార్టీని వీడి తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని, తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారన్న ప్రచారం అంతా రూమర్స్ అని కొట్టి పారేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ చేయిస్తున్న ప్రచారమేనని ఈటల విమర్శించారు. 20 ఏళ్లుగా టీఆర్‌ఎస్ పార్టీలో పని చేశానని.. 28 మంది ఎమ్మెల్యేల్లో పది మంది బయటకు వెళ్లిపోయినా తాను పార్టీని వీడలేదని చెప్పారు. అంతేకాదు టీఆర్‌ఎస్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా తాను పార్టీ మారలేదన్నారు. 2015 నుంచి పార్టీలో ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈటల పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఈటల వ్యాఖ్యానించారు.

