మరో షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ.. వరుసగా మూడోసారి
అంతా అనుకున్నట్టే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. నేటి ఉదయం జరిగిన ఎంపీసీ కమిటీ సమావేశంలో అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. బ్యాంకుల నుండి వసూలు చేసే వడ్డీరేటుని 50 పాయింట్లు పెంచినట్టు ప్రకటించింది. దీంతో మొన్నటి వరకు ఉన్న రెపో రేటు 4.90 శాతం నుండి 5.40 శాతంకి చేరింది. ఇంతక ముందు జరిగిన సమావేశంలో 35 పాయింట్లు పెంచనున్నట్టు అంచనా వేసిన ఆర్‌బీఐ , దానికి భిన్నంగా మరో 20 పాయింట్లు అధికంగా పెంచడం గమనార్హం. రెపో రేటు పెంచినందున ఈఎమ్‌ఐలు చెల్లించే వారికి ఇది మరో తలభారంగా మారనుంది.
కొవిడ్ కారణంగా ఆర్‌బీఐ రెపో రేటులో అనుకోని మార్పులను తీసుకొచ్చింది. ఎడాది తిరగక ముందే మూడు సార్లు రెపో రేటును పెంచింది. మే నెలలో అనుహ్యంగా జరిగిన ఆర్‌బీఐ సమావేశంలో 40 పాయింట్లు బేసిస్ పెంచగా , జూన్ నెలలో రెండోసారి జరిగిన సమావేశంలో 50 పాయింట్లు పెంచింది. అప్పటి వరకు పెంచిన బేసిస్ పాయింట్లతో 4.90 శాతంగా ఉన్న రెపో రేటును , తాజాగా గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడో రోజు జరిగిన సమావేశంలో మరో 50 పాయింట్లు పెంచడంతో 5.40 శాతానికి చేరినట్టు తెలిపింది. అన్ని ధరల పెంపు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమావేశంలో తెలిపింది.