NationalNewsNews Alert

కొత్త భారత ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్!

Share with

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులుకానున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, లలిత్ పేరును సిఫారసు చేస్తూ… కేంద్రన్యాయశాఖకు లేఖ రాశారు. లేఖ కాపీని జస్టిస్ రమణ స్వయంగా జస్టిస్ లలిత్ కు అందజేశారు. ప్రధాన న్యాయమూర్తి పంపిన లేఖను న్యాయశాఖ ప్రధానికి పంపించనుంది. ప్రధాన మంత్రి లేఖను పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తారు. చివరగా రాష్ట్రపతి అమోదంతో ప్రధాన న్యాయమూర్తి నియామకం జరుగుతుంది. భారతదేశం 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ, 24 ఏప్రిల్ 2021న ఎస్.ఎ బోబ్డే నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 49వ ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ ఈ నెల ప్రమాణస్వీకారం చేయన్నున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉమేశ్ లలిత్ మూడు నెలల కంటే తక్కువ కాలమే పదవిలో కొనసాగుతారు. ఎందుకంటే ఆయన ఈ ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. డైరెక్టుగా సుప్రీంకోర్టు జడ్జి అయి ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టనున్న రెండో వ్యక్తి జస్టిస్ లలిత్. ఇంతకుముందు ఇలా జస్టిస్ ఎస్ఎం సిక్రి ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఆయన 1971 నుంచి 1973 వరకు ప్రధాన న్యాయమూర్తి గా పని చేశారు. కాగా, జస్టిస్ రమణ.. ఈ నెల 26న పదవి విరమణ చేయనున్నారు. ఆయన 16 నెలలకు పైగా పదవిలో ఉన్నారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాలని న్యాయ శాఖ కోరగా.. తన తర్వాత అత్యంత సీనియర్ అయిన లలిత్ పేరును జస్టిస్ రమణ సిఫార్సు చేశారు.

1957 నవంబర్ 9న మహారాష్ట్రలో జన్మించిన జస్టిస్ లలిత్… 1983 జూన్‌‍లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. జనవరి 1986లో… అతను తన ప్రాక్టీస్‌ని ఢిల్లీకి మార్చారు. జస్టిస్ లలిత్ ఒక సీనియర్ న్యాయవాది. 13 ఆగస్టు, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జడ్జిగా కీలక కేసుల్లో జస్టిస్ లలిత్ తీర్పు ఇచ్చారు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ హక్కు అప్పటి ట్రావెన్‌కోర్ యొక్క పూర్వపు రాజకుటుంబంకు ఉంటుందని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇచ్చింది. 2017లో తక్షణ ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జీల బెంచ్​లో లలిత్ ఒకరు. పిల్లల లైంగిక భాగాలను తాకడం లేదా లైంగిక ఉద్దేశంతో వాళ్లను టచ్ చేయడం.. పోక్సో చట్టం కిందికే వస్తుందని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు చెప్పింది. 2జీ స్పెక్ట్రమ్‌లో విచారణ జరిపేందుకు సీబీఐకి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు