నన్ను ఓడించాలని చూసిన వ్యక్తినే పార్టీలో చేర్చుకుంటారా?
కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయ్. ఓవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, సోనియా గాంధీకి లేఖ రాయడంతో మొత్తం వాతావరణం మారిపోయింది. రేపోమాపో స్పీకర్‌ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్న తరుణంలో అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు బాలేదంటూ మండిపడ్డారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి తప్పు మీద తప్పు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే మునుగోడుకు వెళ్తానన్నారు వెంకట్ రెడ్డి. గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి రాజకీయంగా ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వెంకట్ రెడ్డి తాజా ప్రకటనతో నల్గొండ రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారేలా కన్పిస్తున్నాయ్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరేందుకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో.. వెంకట్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ హస్తం పార్టీలో కంగారు పుట్టిస్తోంది. రేవంత్ రెడ్డి వైఖరిపై మొదట్నుంచి అసంతృప్తిగా ఉన్న వెంకట్ రెడ్డి.. పార్టీ మారే విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. తనుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చెరుకు సుధాకర్ రెడ్డిని ఎలా చేర్చుకుంటారని ఆయన కస్సుమంటున్నారు.