InternationalNational

అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధం.. రక్షాబంధన్

Share with

అన్నాచెల్లెళ్లు,  అక్కాతమ్ముళ్ల ఆత్మీయ అనుబంధాలకు రాఖీ పండుగ ఓ తీపిగుర్తు. తన అన్నకు లేదా తమ్ముడికి ఎలాంటి కష్టం కలుగకూడదని, నష్టం రాకూడదని, సుఖసంతోషాలతో జీవితాంతం వర్థిల్లాలని కోరుకుంటూ ఆడపడుచు కట్టే రాఖీకి మన సంస్కృతిలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును అందరూ పండుగలా జరుపుకుంటారు. దీనినే రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి లేదా బ్రాహ్మణులు జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజున రాఖీ కట్టిన చెల్లెలికి కానుకలు, బహుమతులు ఇచ్చి తన ఆశీస్సులు అందిస్తారు అన్నలు.

ఈ రక్షాబంధన్ ఈనాటిది కాదు. దీనికి పురాతన చరిత్ర కూడా ఉంది. దేవదానవులకు త్రిలోకాధిపత్యమే లక్ష్యంగా జరుగుతున్న యుద్దాల వల్ల దేవతలు పడే బాధలు చూసిన ఇంద్రుని పత్ని శచీదేవి పరమేశ్వరుడిని, లక్ష్మీ నారాయణుని ఆరాధించి భర్త చేతికి రక్షా బంధనం  కడుతుంది. దానితో ఉత్తేజంగా యుద్ధంచేసి రాక్షసులను జయిస్తాడు ఇంద్రుడు.  అది తర్వాత కాలంలో అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు కడుతూ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ రాఖీ పౌర్ణమిని బలేవా అనికూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి.  బలిచక్రవర్తి  రక్షణ కోరిన తన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా ధైర్యంతో ఎదురునిలిచాడు. అలాంటి సోదరభావాన్ని పునస్కరించుకొని రక్షాబంధన్ పర్వదినం జరుపుకునే సంప్రదాయం మొదలైంది.

మహాభారతంలో కూడా వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి తన తండ్రి కానీ, తన ఐదుగురు భర్తలు కానీ గుర్తురాలేదు. కానీ తన సోదరసమానుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆర్తిగా, నిస్సహాయంగా ప్రార్ధించింది. ఆయన తన సోదరికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి, ఆమెను అవమానం నుండి తప్పించాడు.

ఈరోజున తన అన్నదమ్ములకు రాఖీ కట్టి,  ముఖాన తిలకం దిద్ది, మిఠాయి తినిపించి మురిసిపోతారు ఆడపడుచులు. కొంతకాలం క్రితం వరకూ రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. ఇప్పుడు దీనిలో ఆనందం, అనుబంధం అందరికీ అర్థం కావడంతో దేశంలోని అన్ని మతాలకూ పాకింది. అలాగే సొంత అన్నదమ్ములకే కాకుండా వరసయ్యే అన్నదమ్ములకూ, పక్కింటి వారు, స్నేహితులకూ కూడా రాఖీలు కడుతున్నారు అమ్మాయిలు. కాలేజీలలో వెంటబడి, వేధించే పోకిరీలకు రాఖీలు కట్టి వదిలించుకునే తెలివైన అమ్మాయిలు కూడా ఉన్నారు. కాబట్టి మనమందరమూ కూడా రేపు ఆగస్టు 11 వ తేదీన జరిగే రాఖీ పండుగను సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకుందామా..