NationalNews

‘కర్తవ్య పథ్‌’గా మారనున్న ‘రాజ్‌పథ్‌’

ఢిల్లీలోని ‘రాజ్‌పథ్‌’ ఇక నుంచి ‘కర్తవ్య పథ్‌’గా మారనుంది. కర్తవ్య పథ్‌ను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. దేశ రాజధానిలో కీలక ప్రాంతంగా ఉన్న రాజ్‌పథ్‌కు అనేక మార్పులు చేసి.. దాని పేరును కర్తవ్య పథ్‌గా ఢిల్లీ నగర పాల పరిషత్‌ మార్చింది. ఇండియా గేట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకూ ఉన్న ఈ ప్రాంతంలో ఎర్రటి గ్రానైట్‌ రాళ్లతో పాదచారుల బాటను ఏర్పాటు చేశారు. రోడ్డుకు రెండు వైపులా పూర్తి పచ్చదనంతో తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకుల కోసం ఆయా రాష్ట్రాలకు చెందిన ఆహార పదార్ధాలను అందించే స్టాళ్లను దారిలో ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ విస్టా పేరుతో చేపట్టిన పనుల్లో భాగంగా ఈ రోడ్డును అందంగా తీర్చిదిద్దారు.

క్రిషి భవన్‌, వాణిజ్య భవన్‌ పరిసరాల్లో పడవ షికారు చేసే ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాదు.. ఇండియా గేట్‌ వద్ద 28 అడుగుల నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. ఈ విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ తయారు చేశారు. 280 మెట్రిక్‌ టన్నుల బరువున్న 28 అడుగుల విగ్రహాన్ని ఖమ్మం జిల్లా నుంచి 140 చక్రాలున్న 100 అడుగుల లారీలో తీసుకొచ్చారు. ఢిల్లీలో గత చరిత్రను మర్చిపోయేలా.. ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలన గుర్తుకొచ్చేలా సెంట్రల్‌ విస్టాన్‌ రూపొందిస్తున్నారు. ఈ కొత్త పార్లమెంటు భవనం త్వరలోనే అందుబాటులోకి రానుంది.