NewsTelangana

రాజగోపాల్ రాజీనామాస్త్రం… మునుగోడులో సై అంటే సై

Share with

కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని ప్రకటించిన మరుసటి రోజు కూడా…పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారని… ఇక రేపోమాపో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతన్నారని వార్తలు గుప్పుమంటున్నాయ్. ఒక్క రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదని..కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరో ఇద్దరు నేతలు సైతం అందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశం కావడం.. పార్టీ మారితే సపోర్ట్ చేస్తారా అంటూ కోరడం.. ఇవన్నీ కూడా ఉపఎన్నికల సంకేతాలుగా కన్పిస్తున్నాయ్.

ఓవైపు కేసీఆర్… మరోవైపు కాంగ్రెస్ పార్టీ వల్లే తాను ఎన్నికలకు వెళ్తున్న సందేశాన్ని ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని… అదే సమయంలో ఉపఎన్నికల వస్తే తప్పితే… కేసీఆర్ అభివృద్ధి పట్టించుకోరని… ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయాలకంటే అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానన్న సందేశాన్ని ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు ‘మనసర్కార్’కు విశ్వసనీయ సమాచారం అందింది. అదే సమయంలో రాజీనామాపై తొందరపడకూడదన్న ఆలోచనలో కూడా కోమటిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నియోజకవర్గ ప్రజలతో విస్తృత సమావేశాలు నిర్వహించి… అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం తీసుకున్నాకే రాజీనామాపై ఒక నిర్ణయం వెలువడం అవకాశం ఉంది.

రాజీనామా చేయడానికి రాజగోపాల్ రెడ్డి ఒక అస్త్రాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేస్తేనే నియోజకవర్గానికి ఎన్నికలు వస్తేనే… నిధులు.. అభివృద్ధి జరుగుతుందన్న ప్రచారం జరుగుతోందని అందుకే తాను చివరి అస్త్రంగా రాజీనామా అంశాన్ని పరిశీలిస్తున్నానంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తీరుపైనా రాజగోపాల్ రెడ్డి అసహనంగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా… పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. నాడు సీఎల్పీ పదవి అడిగినా… ఇవ్వలేదని… పీసీసీ చీఫ్ కోసం గట్టిగా కొట్లాడినా పరిగణలోకి తీసుకోలేదని… పార్టీ కోసం చానెల్ పెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కాంగ్రెస్ పార్టీకి చీమకుట్టినట్టయినా లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.