NewsTelangana

రాజాసింగ్‌ లాయర్‌కు చంపేస్తామని వార్నింగ్‌

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కేసు వాదించినందుకు తనకు బెదిరింపు కాల్స్‌ చేస్తున్నారని అడ్వకేట్‌ కరుణ సాగర్‌ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. అయితే రాజాసింగ్‌ తరుఫున లాయర్‌ కరుణ సాగర్‌ కోర్టులో వాదనలు వినిపించారు. సాగర్‌ వాదనలతో ఏకీభవించిన కోర్టు… రాజాసింగ్‌ రిమాండ్‌ను రిజెక్ట్‌ చేయడంతో పాటు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో అడ్వకేట్‌ కరుణ సాగర్‌కు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు దుబాయి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని కరుణ సాగర్‌ తెలిపారు. ఈ కేసును వాదిస్తే చంపుతామని వార్నింగ్‌ కూడా ఇచ్చారన్నారు. ఒక న్యాయవాదిగా తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చానే తప్ప ఎవరికి వ్యతిరేకంగా పని చేయలేదని స్పష్టం చేశారు. రాజాసింగ్‌ అరెస్ట్‌ సమయంలో పోలీసులు చట్టపరంగా వ్యవహరించ లేదని, అందువల్లే రిమాండ్‌ రిజక్టయ్యిందన్నారు. 41 సీఆర్‌పీసీ నిబంధనలు పాటించనందువల్లే రాజాసింగ్‌కు బెయిల్‌ వచ్చిందని లాయర్‌ తెలిపారు. ఈ విషయంపై పోలీసులు ఫిర్యాదు చేస్తానన్న ఆయన.. బెదిరింపులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు.