NewsTelangana

హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంటోంది…

Share with

వరుస వర్షాలతో హైదరాబాద్ కకావికలమవుతోంది. జులై నెల ఆరంభం నుంచి అడపాదడపా వస్తున్న వర్షాలు భాగ్యనగరాన్ని వణికిస్తున్నాయ్. హుస్సేన్ సాగర్ నిండిపోయేలా వర్షం కురిసిందంటే అసలు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైతే… సాధారణ జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో మరో రెండు రోజులు వర్షం కురుస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం బెంబేలెత్తిపోయారు.

ఐతే ఉదయం నుంచి వర్షం కురవకుండా ఉండటంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ జనంలో ఉంది. కానీ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ వర్షం కురుస్తున్నట్టు సమాచారం లేదు. వాతావరణం పొడిగా ఉంది. పైగా సూర్యుడు సైతం కన్పిస్తున్న నేపథ్యంలో ఇవాళ పెద్దగా వర్షం కురవకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అసలే వీకెండ్ కావడంతో.. గత రెండు వారాలుగా జనం శని, ఆదివారం పనులన్నీ పెండింగ్ అయిపోయాయ్. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు వర్షం తెరిపివ్వాలని హైదరాబాద్ పౌరులు కోరుకుంటున్నారు. ఐతే వాతావరణ శాఖ మాత్రం ఇవాళ, రేపు కూడా హైదరాబాద్ తోపాటు, తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురవచొచ్చని అధికారులు తెలిపారు.