కేరళ వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ, కాంగ్రెస్ అగ్ర నేతలకు సీట్లు ఖరారు
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ, నిన్న సాయంత్రం జరిగిన మొదటి సమావేశంలో, పది రాష్ట్రాలలో చాలా మంది అభ్యర్థులను ఖరారు చేసింది. సమావేశం అర్ధరాత్రి దాటిన తరువాత, “త్వరలో అధికారిక ప్రకటన చేయబడుతుంది” అని పార్టీ సీనియర్ నాయకుడు కెసి వేణుగోపాల్ చెప్పారు. ” కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్‌ల నుండి సీట్లను ఖరారు చేసాం. ప్రక్రియ కొనసాగుతోంది, అతి త్వరలో అధికారిక ప్రకటన చేస్తాం,” అని వేణుగోపాల్ విలేకరులతో అన్నారు. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి, మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ నుంచి, జ్యోత్స్నా మహంత్ కోర్బా నుంచి మళ్లీ పోటీ చేస్తారని వర్గాలు తెలిపాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి కీలక నేతలంతా బరిలోకి దిగనున్నారు.

కేరళ నుంచి 20 స్థానాలకు గానూ 16 స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కూడా అభ్యర్థుల్లో ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో, కాంగ్రెస్ రాష్ట్ర మంత్రులను రంగంలోకి దించడం లేదు. చాలా మంది మంత్రులు జాతీయ ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇద్దరు మంత్రులు ప్రజాభిప్రాయం కోరగా… ఒకరు మాత్రమే పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల్లో రాష్ట్ర పార్టీ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు, ఆ పార్టీ ఎంపీ డీకే సురేష్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్థానమైన కల్బుర్గిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సోమవారం మరోసారి కమిటీ సమావేశం కానుంది.

ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, లక్షద్వీప్‌ల అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. ఈశాన్య రాష్ట్రాల అభ్యర్థులను సెకండ్ లిస్టులో రిలీజ్ చేసే అవకాశం ఉంది. వేసవిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, 90 స్థానాలు ఉన్న మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రెండు కీలక రాష్ట్రాలలో సీట్ల భాగస్వామ్య సమస్యను పార్టీ ఇంకా పరిష్కరించనప్పటికీ అభ్యర్థుల ఖరారు ప్రారంభమైంది. మహారాష్ట్రలోని 48 సీట్ల కోసం మహా వికాస్ అఘాడి మిత్రపక్షాలతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. బెంగాల్‌లో, సీట్ల భాగస్వామ్య ప్రక్రియతో తాను విసిగిపోయానని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మమతను శాంతింపజేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

