Home Page SliderNational

ఆ కేసులో రాహుల్ గాంధీకి లభించని ఊరట

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. “మోదీ ఇంటిపేరు” వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై, మధ్యంతర స్టే ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ పిటిషన్ పై తీర్పు ఇవ్వడానికి గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 4 తర్వాత ఆయన పిటిషన్‌పై కోర్టు ఉత్తర్వులు ఇస్తామంది. పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వును ప్రకటించే వరకు శిక్షపై మధ్యంతర స్టే విధించాలని రాహుల్ గాంధీ కోరారు.

కేరళలోని వాయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీకి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 499, 500 కింద బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దాఖలు చేసిన కేసులో క్రిమినల్ పరువు నష్టం కేసులో మార్చి 23న కోర్టు దోషిగా తేలడంతో రెండేళ్ల జైలు శిక్ష పడింది. “దొంగలందరికీ మోదీనే సాధారణ ఇంటిపేరుగా ఎలా పెట్టారు?” అంటూ ఏప్రిల్ 13, 2019న కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఆ వ్యాఖ్యలపై కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడింది. ఒక సభ్యుడు రెండు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఏదైనా నేరానికి పాల్పడినట్లయితే, అతని లేదా ఆమె సీటు ఖాళీగా ప్రకటించబడుతుందని చట్టం పేర్కొంటొంది. శిక్షను సస్పెండ్ చేస్తే తప్పించి పార్లమెంటులో తిరిగి రాహుల్ గాంధీ ప్రవేశించలేరు. లోక్‌సభ హౌసింగ్ కమిటీ తన 12, తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయమని లేఖ పంపించడంతో… 2005 నుండి ఉంటున్న తన అధికార నివాసాన్ని ఎంపీ హోదాను కోల్పోవడంతో గత నెలలో రాహుల్ గాంధీ ఖాళీ చేశారు.

ఏప్రిల్ 3న, రాహుల్ గాంధీ తరపు న్యాయవాది సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టు రెండేళ్ల జైలు శిక్షపై, బెయిల్ మంజూరు చేయగా, శిక్షపై స్టే విధించాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అప్పీల్ దాఖలు చేసేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. గత బుధవారం, గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ గీతా గోపి ఈ కేసును అత్యవసర విచారణ కోసం తన ముందు సమర్పించిన తర్వాత విచారణ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత కేసును జస్టిస్ హేమంత్ ప్రచ్చక్‌కి అప్పగించారు.