ఆ రహస్య గదుల్లో ఏముందో తెలిస్తే మైండ్ బ్లాక్
మనదేశ సాంస్కృతిక సంపద గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకోవలసింది దేవాలయాల గురించే. ఎందుకంటే మనకు రాజుల చరిత్ర, వారి వైభవం, వారి వంశాల గురించిన సమాచారం అంతా దేవాలయాలు, రాజుల కోటల ద్వారానే తెలుస్తోంది. వారు తమ రాజ్యానికి సంబంధించిన సమాచారమంతా దేవాలయాల గోడల మీద, కోటల గోడల మీద శాసనాలు రాయించేవారు. అంతేకాదు వారు దేవాలయాలకు ఎంతో విలువైన కానుకలను, భూములను ఇచ్చేవారు. కొంత సంపదను, ఖజానాను కూడా దేవాలయాలలో రహస్య గదులలో, నేలమాళిగలలో దాచిపెట్టేవారు.
తాజాగా ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయానికి సంబంధించిన శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో స్వామి సంపద ఎంత ఉంది అనే చర్చలు బాగా వినిపిస్తున్నాయి. పూరీ దేవాలయంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయని, ఈ భండాగారానికి చెందిన మూడోగది నుంచి సొరంగమార్గం కూడా ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది. ఈ గదిలో అపారసంపద ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. వాటిలో వజ్రాలు, వైఢూర్యాలు, రకరకాల రత్నాలు, స్వర్ణ కిరీటాలు కూడా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

1926 లోనే నాటి బ్రిటిష్ పాలకులు ఈ రత్న భాండాగారాన్ని తెరిపించారు. అప్పట్లో చెన్నైకి చెందిన నిపుణులు ఆభరణాలను లెక్కించారని, దాదాపు 600 రకాల ఆభరణాలు ఉన్నాయని, ఆ సంపదను వారే వెలకట్టలేకపోయారని, ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర తెలియజేశారు. 12 వ శతాబ్దం నుండి 18 శతాబ్దం వరకూ ఒడిశాను పాలించిన 46 మంది రాజులు జగన్నాథుని భక్తులని, వారు స్వామి వారి కోసం వెలకట్టలేని సంపదను రహస్య గదుల్లో భద్రపరిచినట్లు తెలిపారు. ఆ రహస్యగది దిగువన సొరంగమార్గం ఉందని, దానికింద మరిన్ని గదులున్నాయని అప్పట్లో నిపుణులు చెప్పారట. తాము ఆ భూగర్భంలో ఉన్న ఆ గదులకు వెళ్లలేకపోయామని, లోపల సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించినట్లు మిశ్రా చెబుతున్నారు.

పూరీ మాత్రమే కాదు కేరళలోని తిరువనంతపురంలో కూడా పద్మనాభస్వామివారి ఆలయంలో ఈమధ్య బయటపడిన నిధుల గురించి మనకు తెలిసిందే. ఆలయం క్రింద నేలమాళిగలోని రహస్య గదులు, వాటిలో బంగారు విగ్రహాలు చాలా బయటపడ్డాయి. వేల కోట్ల సంపదను అప్పటి పరిపాలకులు దాచిపెట్టారు. అక్కడ కూడా ఇంకా తెరవని రహస్య గదులు కొన్ని ఉన్నాయి. లోపల విషసర్పాలు ఉన్నాయని, సముద్రపు హోరు వినిపిస్తోందని, ఆ గదిని తెరిస్తే సముద్రం ఊరిని ముంచేసి, ప్రళయం సంభవిస్తుందని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

హంపీ విజయనగరంలో కూడా రాయల కాలంలో వీధుల్లో రత్నాలను రాశులుగా పోసి అమ్మేవారని చరిత్రలో చదువుకున్నాం. అంటే అప్పుడు అంత సంపద మన దేశంలో ఉండేదన్నమాట. ఇంకా వెలుగు చూడని దేవాలయాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అనేక దేశాలు, మతాల వారి దండయాత్రల కారణంగా ఆనాటి రాజులు వారి సంపదలను, భూగర్భంలో, నిధుల రూపంలో, దేవాలయాలలోని రహస్య గదులలో దాచిపెట్టేవారు. మనదేశ సంపదని ఇప్పటికే చాలావరకూ విదేశీయులు కొల్లగొట్టుకు పోయారు.

