ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో ప్రజాగళం
ప్రత్యేక హోదా సాధన ఏపీ ప్రజల హక్కు.. దేశ ప్రజల ఆకాంక్ష
విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం పెద్దన్నగా ఆదుకోవాలి
ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా సాధనకు పోరాటమన్న ఎంపీ మార్గాని
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ సీపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లోక్ సభలో గళమెత్తారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధన ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షతో పాటు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న ప్రధాన అంశంగా కేంద్రం చూడాలని విజ్ణప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఎన్నో సార్లు వినతులు ఇచ్చినా.. హక్కుగా ఇవ్వాల్సిన హోదాను ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ ఎంపీ బుధవారం లోక్‌సభలో ప్రస్తావించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు విడిపోయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం తండ్రిలా వ్యవహరించి, సోదరులిద్దరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని మాజీ ఉప రాష్ట్రపతి అప్పటి ఎంపీ వెంకయ్య నాయుడు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

