NewsTelangana

వాళ్లకింద నేను పనిచేయలేను-కోమటిరెడ్డి

Share with

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణా రాష్ట్రంలో ఉద్యమకాలంలో కాంగ్రెస్‌లో ముఖ్యభూమిక పోషించిన వ్యక్తి.  ఆయన మునుగోడుకు  ఎమ్మెల్యే . కొన్నేళ్లుగా ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌పై  అసహనంగా ఉన్నట్లు ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యల రూపంలో తెలుస్తోంది. ఎన్నాళ్లుగానో పార్టీలో ఉన్న తనలాంటి సీనియర్‌ని కాదని, నిన్నకాక మొన్న వచ్చిన రేవంత్‌రెడ్డికి పార్టీ అధ్యక్షపదవి అప్పగించడం ఆయనకు రుచించలేదు. తెలంగాణా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానంతో ఎంపీగా తాను అన్ని విషయాలు వివరించి రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకొనేలా చేసానని ఆయన వివరించారు. ఇప్పుడు ఉద్యమ నేపథ్యమే లేని వ్యక్తికి అధిష్టానం రాష్ట్ర పార్టీ అధ్యక్ష భాద్యతలు అప్పగించిందని బాధ వ్యక్తం చేసారు. జైలుకు కూడా వెళ్లి వచ్చిన అలాంటి వ్యక్తి క్రింద పని చేయవలసి రావడమే కాకుండా వారిచేత నీతులు చెప్పించుకోవలసిన పరిస్థితులు వచ్చాయని, సొంత పార్టీలోనే పరాయి వ్యక్తిగా మారిపోతున్నామని వాపోయారు. రేవంత్ మరో పార్టీనుండి వచ్చిన వ్యక్తి అనీ, అలాంటి వ్యక్తుల కింద పని చేయాలనే నిర్బంధం చేయడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. తనలాంటి ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయిందని, తాను పార్టీనుండి వైదొలగితే దానికి రేవంతే కారణమనే అభిప్రాయం వెల్లిబుచ్చారు. తాను ఇంతవరకూ పార్టీని ఎప్పుడూ విమర్శించలేదని, తనకు ఇష్టంలేని వ్యక్తిని పార్టీ పెద్దగా నియమించడం నచ్చక దీర్ఘకాలం పాటు మౌనంగా ఉండిపోయానని, ఇక ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగలేనని పేర్కొన్నారు.

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ నాయకత్వంతో విభేదాలు ఉన్నాయని, రేవంత్‌రెడ్డి వ్యవహారం రుచించడం లేదని, పార్టీలో ఈయనకు ప్రాధాన్యత తగ్గిపోతోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.