మేయర్ విజయలక్ష్మీకి నిరసన సెగ
జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మీకి ఉప్పల్‌లో నిరసన సెగ తగిలింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి లేకుండా శంకుస్థాపనకు వెళ్లారు మేయర్. స్థానిక ఎమ్మెల్యే లేకుండా చిలుకానగర్ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా శంకుస్థాపన చేస్తారని బీఆర్ఎస్ కార్యకర్తలు మేయర్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే వచ్చే వరకూ ఆగాలన్నారు. దీంతో స్థానిక నాయకులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరి పర్మీషన్ అవసరం లేదని.. ఎవరికీ చెప్పాల్సిన పని లేదన్నారు. మేయర్ సమాధానంపై స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు విజయలక్ష్మీతో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని.. ఎమ్మెల్యే అవసరం లేకుండానే పనులు చేపడతామన్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు మేయర్‌కు వ్యతిరేకంగా మేయర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనల మధ్యే అభివృద్ధి పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. మేయర్ ప్రోటోకాల్‌ను పాటించడంలేదంటూ సొంత పార్టీ నాయకులే నిరసన వ్యక్తం చేశారు.


