నా హక్కులను కాపాడండి
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో, ఈ-కామర్స్ వేదికలపై కొందరు వ్యక్తులు వ్యవహరిస్తూ, పలు అభ్యంతరకర పోస్టులను వైరల్ చేస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, అలాంటి లింకులను ఏడు రోజుల్లోపు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. తాను తొలగించాలని కోరుకుంటున్న పోస్టుల యూఆర్ఎల్స్‌ను 48 గంటల్లోపు సోషల్ మీడియా సంస్థలకు అందించాలని పవన్ కల్యాణ్ న్యాయవాదికి కోర్టు సూచించింది. ఇటీవల కాలంలో టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కూడా తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం కోర్టులను ఆశ్రయించిన బాటలోనే పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. సెలబ్రిటీలు తమ అనుమతి లేకుండానే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తమ పేరు, చిత్రం, సారూప్యత వంటి గుర్తింపు లక్షణాలను అనధికారికంగా వాణిజ్య లాభం కోసం ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

