జోరుజోరుగా డ్రమ్స్ వాయించిన ప్రధాని మోదీ
కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ చాలా సందడి చేశారు. గుల్బర్గా జిల్లాలోని కలబురాగి అనే ప్రాంతంలో ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడి సంప్రదాయ డ్రమ్‌ను తమాషాగా వాయించి, ప్రజలను ఉత్సాహపరిచారు. అందరూ చప్పట్లు, విజిల్స్ వేస్తూ మోదీని ఉత్తేజపరిచారు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా అక్కడి సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ ఆనందిస్తూ ఉంటారు. దేశంలోనే కాదు విదేశ ప్రయాణాలలో సైతం ఆయన ఇలాగే సందడి చేస్తుంటారు.
కర్ణాటక డబుల్ ఇంజన్ సర్కారు అభివృద్ధికి ప్రతీక అని, తమది ఓటుబ్యాంకు రాజకీయం కాదని, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం అనీ ఉద్ఘాటించారు. డబుల్ బెనిఫిట్, డబుల్ అభివృద్ధి అని పేర్కొన్నారు. మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ నెలలోనే రెండుసార్లు కర్ణాటకలో పర్యటించారు. గతవారం నేషనల్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా హుబ్బలిలోనూ, ఇప్పుడు కొడెకల్‌లో నేషనల్ హైవే డెవలప్‌మెంట్ ప్రాజెక్టుతో పాటు పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం బసవరాజ్ జొమ్మై, ఇతర మంత్రులు, పార్టీ నేతలు హాజరయ్యారు. భారత దేశం శరవేగంగా అభివృద్ది చెందుతోందని, రాబోయే 25 సంవత్సరాలలో 100 సంవత్సరాల స్వతంత్ర్య భారతంగా ఆవిర్భవించబోతోందని ప్రజలనుద్దేశించి ప్రధాని పేర్కొన్నారు.

