NationalNews

4న ఏపీకి రాష్ట్రపతి ముర్ము.. ఎన్టీఆర్‌ గ్రామం సందర్శన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం సందర్భంలో తొలిసారి ఏపీకి వచ్చిన ముర్ము ఇప్పుడు తొలి అధికారిక పర్యటన జరపనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో బయల్దేరి 10 గంటల 15 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయంలో దిగుతారు. తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించనుంది. రాష్ట్రపతిని ఏపీ ప్రభుత్వం తరఫున గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం వైఎస్‌ జగన్‌ సన్మానిస్తారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చే విందులో ముర్ము పాల్గొంటారు.

నేవీ డే ఉత్సవాలకు హాజరు..

రాష్ట్రపతి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు. సాయంత్రం విశాఖలో జరిగే నేవీ డే ఉత్సవాల్లో పాల్గొంటారు. రక్షణ దళాల సుప్రీం కమాండర్‌గా సైనికుల విన్యాసాలు తిలకిస్తారు. రాష్ట్రంలో రక్షణ-జాతీయ రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌ విధానంలో విశాఖ నుంచే శంకుస్థాపనలు చేస్తారు. కర్నూలు నేషనల్‌ ఓపెన్‌ ఏయిర్‌ రేంజ్‌ను కూడా వర్చువల్‌గానే ప్రారంభిస్తారు. ఎన్టీఆర్‌ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ అడ్వాన్స్డ్‌ నైట్‌ విజన్‌ ప్రొడక్ట్స్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. రాయచోటి – అంగల్లు జాతీయ రహదారి సెక్షన్‌ను, కర్నూలు నగరంలో ఆరు లేన్లుగా విస్తరించిన రోడ్డును కూడా ప్రారంభిస్తారు. మదిగుబ్బ – పుట్టపర్తి హై వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

రాష్ట్రపతి ఆదివారం రాత్రి విశాఖ నుంచి తిరుపతి చేరుకుంటారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని అక్కడి గోశాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటిస్తారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం ఢిల్లీ బయల్దేరుతారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రపతి వెంట పాల్గొనే సీఎం జగన్‌ కూడా అదే రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. జీ-20 దేశాల కూటమికి భారత్‌ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో వైఎస్‌ జగన్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొంటారు.