NewsTelangana

దీపావళి వేళ .. జాగ్రత్తలు ఇలా …

దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే.. బంధువుల రాకపోకలు… అతిథి మర్యాదలు… టపాసుల మోతలు ఇలా దీపావళి పండుగ అంతా సందడిగానే ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ. దీపాలు అలంకరణలు కొనుగోలు ,టపాకాయలు, పూజలు, ప్రార్థనలు బహుమతులు, పలహారాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేది భారతీయ పండుగలు. వాటితో ఆనంద ఉత్సాహాలతో జాతి కులమత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దివ్య దీప్తుల దీపావళి. చీకటిని పారదోలుతూ వెలుగు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. మరి దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంతే ఉంటుందని అగ్నిమాపక శాఖ, పోలీసులు , వైద్యాధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని వారు చెబుతున్నారు. అధికారులు చెప్పిన సలహాలు సూచనలు ప్రతి ఒక్కరు పాటించి ఈ దీపావళిని మరింత శోభాయమానంగా జరుపుకోవాలని వారు కోరుతున్నారు.

ముందుగా.. ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్లు పక్కన పెట్టుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాలో నిలిపి ఉన్న వాహనాలపై కవర్లు వేసి ఉంచాలి. పిల్లలతోపాటు పెద్దలూ కాటన్‌ దుస్తులనే ధరించడం మంచిది. నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడితే సెప్టిక్‌ కాకుండా నిరోధించేందుకు బర్నాల్‌, దూది, అయోడిన్‌, టించర్‌, డెటాల్‌ కూడిన ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ సిద్ధంగా ఉంచుకోవాలి. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు వెంట ఉండాలి. దగ్గరుండి వారితో కాల్పించడం అత్యంత శ్రేయస్కరం. టపాసులు కాల్చే ప్రదేశం సరైనదై ఉండాలి. రోడ్డు మధ్యలో లేదంటే ఇంటి లోపల, గుంపులుగా ఉన్న చోట కాల్చవద్దని పిల్లలకు తెలియజెప్పాలి. పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూదిపెట్టండి. లక్ష్మి బాంబులకు పిల్లలు దూరంగా ఉంచాలి. ఒక్కోసారి చిచ్చుబుడ్లు కూడా పేలే ప్రమాదముంది. పిల్లలకు ముందుగా అన్ని జాగ్రత్తలూ చెప్పాలి.

టపాసులు కాల్చేటప్పుడు, కాల్చిన తర్వాత చేతులను కళ్లలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకుండా చూడాలి. పాదరక్షలను ధరించడం మరచిపోవద్దు. దీపావళి సామగ్రికి సమీపంలో వెలించిన కొవ్వొత్తులు, అగరువత్తులు ఉంచవద్దు. టపాసులు నాణ్యమైనవి ఎంపిక చేసి లైసెన్సులు కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలి. వెలిగి పేలకుండానే ఆరిపోయిన చిచ్చుబుడ్లు, బాంబుల వద్దకు వెళ్లి పరిశీలించడం, మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయరాదు. వెలిగించిన ప్రతి సామగ్రిని సగం నీళ్లున్న బకెట్లో వేయాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి తద్వారా కరోనా వైరస్ ని నియంత్రించడంతోపాటు దీపావళి బాణా సంచా కాలుష్యం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు . ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీనివల్ల గాలిలో ఉన్న చిన్న చిన్న కణాలు మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. టపాసుల కాల్చేటప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలో బాణా సంచా కాల్చాలి. టపాసులు విక్రయించే వారు విధిగా అనుమతులు తీసుకోవాలి. దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి.