Breaking Newshome page sliderHome Page SliderNational

ఒకే బెంచీపై పేద,ధనిక బిడ్డలు..

న్యూ ఢిల్లీ :దేశంలోని విద్యా వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ఆశించిన ‘సౌభ్రాతృత్వం’ అనే లక్ష్యాన్ని సాధించే దిశగా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. ప్రైవేట్ పాఠశాలల్లో పేద పిల్లల ప్రవేశాలకు సంబంధించిన విద్యా హక్కు చట్టం అమలుపై విచారణ చేపట్టిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం,సామాజిక వివక్షను రూపుమాపేలా బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రిక్షా కార్మికుడి లేదా ఆటో డ్రైవర్ బిడ్డ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా మల్టీ మిలియనీర్ బిడ్డతో కలిసి ఒకే తరగతి గదిలో, ఒకే బెంచీపై కూర్చుని చదువుకున్నప్పుడే అసలైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇది కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకం మాత్రమే కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం చిన్నారులకు కల్పించిన ప్రాథమిక హక్కు అని ధర్మాసనం గుర్తు చేసింది.
గతంలో కొఠారి కమిషన్ సూచించిన ‘సాధారణ పాఠశాల వ్యవస్థ’ను ప్రస్తావిస్తూ, పేద పిల్లలు ధనిక వాతావరణంలో ఇమడగలరా అనే సందేహాలను పక్కన పెట్టాలని కోర్టు సూచించింది. ఉపాధ్యాయులు ఆ పిల్లల నేపథ్యాలను ఒక వనరుగా మార్చుకుని వారిలో ఆత్మగౌరవాన్ని పెంచాలని, కులం లేదా ఆర్థిక స్థితిగతుల వంటి ‘అనుమానాస్పద గుర్తింపులను’ పక్కన పెట్టి విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకం కావడానికి ఆర్‌టీఈ సెక్షన్ 12 దోహదపడుతుందని వివరించింది. సమానత్వం, స్వేచ్ఛ అనేవి వ్యక్తిగత హక్కులు కావచ్చు కానీ, సోదరభావం అనేది కేవలం వ్యవస్థాగత ఏర్పాట్ల ద్వారానే సాధ్యమవుతుందని కోర్టు అభిప్రాయపడింది.
విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సీ) కింద ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల కేటాయింపును క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని ధర్మాసనం రాష్ట్రాలను ఆదేశించింది. వెనుకబడిన వర్గాల పిల్లల ప్రవేశాలకు సంబంధించి అవసరమైన సబార్డినేట్ చట్టాలను వెంటనే సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ విధివిధానాల ఖరారులో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ , రాష్ట్ర కమిషన్ల భాగస్వామ్యం ఉండాలని స్పష్టం చేస్తూ, వివిధ రాష్ట్రాలు రూపొందించిన నిబంధనల సమాచారాన్ని క్రోడీకరించి మార్చి 31, 2026 లోగా సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఎన్‌సీపీసీఆర్‌ను ఆదేశించింది.