NationalNews

ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌పై పాంటింగ్‌ జోస్యం

Share with

ప్రపంచ క్రికెట్‌లో ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ మరెక్కడా లేదు.. ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. మ్యాచ్‌ ఉన్న రోజు క్రికెట్‌ అభిమానులంతా టీవీకి అతుక్కుపోతారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇండో – పాక్‌ జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. మళ్లీ ఇప్పుడు యూఏఈ వేదికగా జరిగే ఆగష్టు 28న ఇండో-పాక్‌ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచుకు ఇంకా 15 రోజుల సమయం ఉన్నా… అప్పుడే ఈ మెగా మ్యాచ్‌పై చర్చ మొదలైంది.

తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌  మ్యాచ్‌ విజేత ఎవరనే విషయంపై జోస్యం చెప్పాడు. ఐసీసీ రివ్యూ ఎపిసోడ్‌లో పాంటింగ్‌ మాట్లాడుతూ… `ఎక్కడ టోర్నమెంట్‌ జరిగినా భారత్‌ కఠిన ప్రత్యర్థే. ఇతర జట్లతో పోలిస్తే.. టీమిండియాకు బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌లో డెప్త్‌ ఉంది. ఆసియా కప్‌ 2022లో విజేత ఎవరంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్‌ టోర్నీలో పాక్‌పై ఇండియా ఆధిపత్యం చలాయిస్తే… ఆసియా కప్‌లో మాత్రం ఫలితం భిన్నంగా ఉంది. ఇరు జట్లు 13 సార్లు తలపడితే… ఇండియా 7, పాకిస్థాన్‌ 5 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్‌ ఫలితం రాలేదు` అని అన్నాడు.

`ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచులో నా ఫెవరెట్‌ మాత్రం టీమిండియానే. ఆసియా కప్‌ 2022 కూడా భారత్‌ గెలుస్తుందని నేను భావిస్తున్నాను. అయితే పాక్‌ను అంత తేలికగా తీసేయడానికి లేదు. పాకిస్థాన్‌ ఈ మధ్యకాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు సూపర్‌ స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. హోరాహోరీ  తప్పదు. ఇంకో 15-20 ఏళ్లయినా భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ తగ్గదు. ఒక క్రికెట్‌ ప్రేమికుడిగా, పరిశీలకుడిగా ఇటువంటి మ్యాచులను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది` అని రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు. ఏ ఫార్మాట్‌లోనైనా  ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తిని పుట్టిస్తుందని అని పాంటింగ్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇండియా, పాకిస్థాన్‌ టెస్టు క్రికెట్‌లో తలపడితే చూడాలని ఉందని.. అసలు మజా టెస్టుల్లోనే ఉంటుందని పాంటింగ్‌ చెప్పాడు. మొత్తానికి ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్‌ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.