వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ కుట్ర
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై యుద్ధం ప్రకటించినట్లు కనబడుతోంది. మునుగోడులో కాంగ్రెస్‌పై సానుభూతి ప్రదర్శించే ప్రజలను ఆ పార్టీకి దూరం చేసి.. బీజేపీ వైపు మొగ్గు చూపేట్లు చేయాలని తపిస్తున్నట్లు వెంకట్‌రెడ్డి చర్యలను బట్టి తెలుస్తోంది. చండూరు సభ తర్వాత కాంగ్రెస్ నాయకులపై విమర్శల సునామీ సృష్టించిన వెంకట్‌రెడ్డి ఇప్పుడు ఆ పార్టీ పరువు తీయాలని కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది.
తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పని చేశానని, ఇప్పుడు ఎంపీగా ఉన్నానని.. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డుగా పని చేస్తున్నానంటూ వెంకట్‌రెడ్డి తన ట్విటర్ ఖాతా ప్రొఫైల్ పిక్‌లో మార్పు చేశారు. ఇది రేవంత్ రెడ్డి హోంగార్డు
వ్యాఖ్యలకు వెంకట్‌రెడ్డి ఇచ్చిన కౌంటర్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పారు. అద్దంకి దయాకర్ కూడా షోకాజ్ నోటీసుకు క్షమాపణ చెబుతూ జవాబిచ్చారు. బహిరంగంగానూ క్షమాపణలు చెప్పారు. అయినా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. తెలంగాణాలో కాంగ్రెస్ పరువు తీసి, మునుగోడులో తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని బీజేపీ తరఫున గెలిపించేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు.