ఏపీలో పార్టీ అధినేతల పొలిటికల్ ఇండిపెండెన్స్
◆ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామన్న వైయస్ జగన్
◆ జనసేన వైపు చూడండి వ్యవస్థలను బలోపేతం చేస్తానన్న పవన్
◆ ప్రధాని మోడీ విజన్ పై పొగడ్తలు కురిపించిన చంద్రబాబు
◆ బిజెపితో పొత్తు కోసం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వేదికగా చేసుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నలుదిక్కుల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరిగిన రాష్ట్రస్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పని వాళ్లు గానే మిగిలిపోకుండా వారి అభివృద్ధి కి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. పేదలందరికీ ఆరోగ్య ఆసరా ఇస్తున్నామని మూడేళ్లలో ఆరు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని పాలన వికేంద్రీకరణ తమ విధానమని రాజకీయాలనేవి ఎన్నికల వరకే పరిమితం అవ్వాలని ఆయన అన్నారు. మహిళా సాధికారికతకు పెద్దపేట వేసామని దేశంలో ఏ ప్రభుత్వం తీసుకొని చర్యలు తమ ప్రభుత్వం తీసుకుందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఒక్కసారి జనసేన వైపు చూడాలని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేసి రాష్ట్రానికి ఆర్థిక పురోగతి తీసుకొస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర అమృతో త్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. రాజకీయాల్లోకి వచ్చాం పార్టీ పెట్టేసామని తేలికపాటి ఆలోచన విధానం తనకు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మొదలుపెట్టడానికి ముఖ్య కారణం స్వతంత్ర ఉద్యమకారుల త్యాగాలు అని, కులం మీదో మతం మీదో ఒక ప్రాంతీయ వాదంతోనో పార్టీలు పెడితే దాని మనుగడ కొంతవరకే ఉంటుందని స్వతంత్రం కోసం పోరాడిన నాయకులెవ్వరు కులం కోసం, మతం కోసం పోరాటం చేయలేదని అలాంటి మహానుభావుల స్ఫూర్తితోనే ముందుకు వెళ్తానని అన్నారు.
పేదల అభ్యున్నతే టిడిపి లక్ష్యమని స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయటంతో పాటు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆయన విజన్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. ముందస్తు ఎన్నికలు అనుకుంటున్న నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీపై పొగడ్తలు కురిపించడంతో కచ్చితంగా బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబునాయుడు తహతహలాడుతున్నట్లు రాజకీయ పండితులు అంటున్నారు. 2019 ఎన్నికల వరకు ప్రధాని మోడిపై నిప్పులు చెరిగిన చంద్రబాబు చల్లబడి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆసరాగా చేసుకొని రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపితో పొత్తు కోసం ఆయనను పొగిడారని కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు.
ఆకలి బాధలు కరువు కాటకాలతో దేశం అల్లాడిందని నెహ్రూ, పివి నరసింహారావు, వాజ్ పేయి , మోడీ వంటి వారు దేశాన్ని సమగ్రంగా ముందుకు నడిపించారని చంద్రబాబు అన్నారు. దేశంలో స్వాతంత్రం ముందు వచ్చిన తర్వాత చూడాలని అలాగే సంస్కరణలకు ముందు సంస్కరణల తర్వాత అనేది కూడా చూడాలని చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలును మోదీ తో జత కట్టటానికి చంద్రబాబు వేదికగా ఎంచుకున్నారని ఈ మధ్యకాలంలో ఢిల్లీలో మోడీని కలిసిన చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం అన్ని రకాల వ్యూహాలకు పదును పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చంద్రబాబు వ్యూహాలు, మోడీపై పొగడ్తలు ఫలించి బిజెపితో టిడిపికి పొత్తు పొడుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.