NewsTelangana

క్లౌడ్‌బరస్ట్ రాజకీయాలు

Share with

ఆడలేక మద్దెలదే తప్పన్నట్లు ఉంది సీఎం కేసీఆర్ వ్యవహారం. ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వెనుక విదే శీహస్తం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. వరద నష్టాలను తగ్గించడానికి మార్గాన్ని చూడకుండా క్లౌడ్ బరస్ట్ అంటూ వింతగా మాట్లాడుతున్నారు. సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్, సీఈఎల్‌ఎస్ డైరెక్టర్ సాయిభాస్కర్, మొదలైనవారు మాట్లాడుతూ తాము వాతావరణ మార్పులపై అవగాహనా సదస్సులు పెట్టడానికి సిద్దమన్నారు. కేసీఆర్ చెప్పినట్టు క్లౌడ్ బరస్ట్, నైరుతి సమయంలో జరగదని తేల్చి చెప్పారు. 1980 లో క్లౌడ్ బరస్ట్ కారణంగా మూసీలో వరదలు సంభవించాయని అన్నారు. లానినా కారణంగానే అధిక వర్షపాతం నమోదు అవుతోందని, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి అసాధారణ వాతావరణ పరిస్థితులు వస్తాయన్నారు. అనగా అధిక వర్షాలు, వేడి తరంగాలు ఏర్పడి కుంభవృష్టులు వస్తాయని, తాము 30 ఏళ్లుగా పర్యావరణంపై పరిశోధనలు చేస్తున్నామని, ఈవరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం కాదని అన్నారు. కేసీఆర్ సిద్దాంతానికి ఋజువులు లేవని, ప్రజలు ప్రకృతి విపత్తులతో బాధ పడుతుంటే రాజకీయాలు చేయడం పద్దతి కాదని అన్నారు శాస్త్రవేత్తలు. ఇదిలా ఉండగా ఈవరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం కాదని, ఎప్పుడూ వచ్చే వరదలేనని గవర్నర్ తమిళిసై అన్నారు.

భద్రాచలం పునరావాస కేంద్రంలో వరద బాధితుల బాధలు చెప్పనలవి కాదు. ఆహారంకోసం, సహాయం కోసం క్యూలైన్లలో వరద బాధితులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు పంట నష్టంపై నష్ట పరిహారం ప్రకటించలేదు. 11 లక్షల ఎకరాలలో కనీసం ఎకరానికి 10 వేల చొప్పున నష్టం జరిగింది. వరదల నష్టం పై ఒక ప్రణాళిక లేకపోవడంతో బాధితులు తల్లడిల్లిపోతున్నారు. గంపగుత్తగా ఏవో అంచనాలు వేసి కలెక్టర్‌లకు నివేదికలు అందజేస్తున్నారు అధికారులు. ఎన్యుమరేషన్‌పై సరైన ఉత్తర్వులు కూడా వ్యవసాయ శాఖ నుంచి లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు.