పోలవరానికి ‘అమరజీవి’ పేరు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని,మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాలనే అర్పించిన పొట్టి శ్రీరాములను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పవన్ పేర్కొన్నారు. “ఐదేళ్లు సీఎంగా చేసిన వారి పేర్లు పెట్టుకుంటున్నాం కానీ, మన ఉనికి కోసం బలిదానం చేసిన మహనీయులను వదిలేస్తున్నాం. పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెడితే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది కేవలం నా ఒక్కడి నిర్ణయం కాదు, అందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు. మహనీయులను ఒక కులానికి పరిమితం చేయడం సరికాదని, అంబేద్కర్ లేదా పొట్టి శ్రీరాములు అందరివాడని ఆయన గుర్తుచేశారు.
జనసేన పార్టీ కేవలం ఎన్నికల కోసం కాకుండా, ఒక పటిష్టమైన సిద్ధాంతం తో పుట్టిందని పవన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. “కష్టాల్లో ఉన్నప్పుడే ఒక వ్యక్తిని లేదా పార్టీని అంచనా వేయవచ్చు. ఓడిపోయినప్పుడు కూడా మనం ప్రజల పక్షాన నిలబడ్డాం కాబట్టే నేడు ప్రజలు మనల్ని గుర్తించారు. జనసేన సుదీర్ఘ కాలం నిలబడే ఐడియాలజీని ఎంచుకుంది. కులం కోసం, ప్రాంతం కోసం పుట్టిన పార్టీ ఇది కాదు. ఏడు సూత్రాలతో రూపొందించిన ఈ ఐడియాలజీని ప్రతి నాయకుడు అర్థం చేసుకోవాలి” అని ఆయన సూచించారు.
గోదావరి ప్రాంతంలో సహజ వనరులను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమ పార్టీ విధానంలో ‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి’ని ఒక ముఖ్యమైన అంశంగా చేర్చామని తెలిపారు. అలాగే, రోహింగ్యాల వలసలు స్థానిక ఉపాధిని ఎలా దెబ్బతీస్తున్నాయో, ఉక్రెయిన్ యుద్ధం ఇక్కడ యూరియా కొరతకు ఎలా కారణమవుతుందో వివరిస్తూ.. నాయకులు అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
“రౌడీలను, గంజాయి అమ్మేవాళ్లను వెనకేసుకొచ్చే వారిని ఒక పార్టీగా గుర్తించాలని కూడా నాకు అనిపించడం లేదు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి వస్తాడేమోనన్న భయం ఎవరికీ అక్కర్లేదు, అది జరగని పని. మాకు ఎవరూ శత్రువులు కాదు, ప్రజలకు ఇబ్బంది కలిగించే వారి విధివిధానాలనే మేము వ్యతిరేకిస్తాం,” అని స్పష్టం చేశారు. జనసేన నాయకులు సంస్కారవంతమైన భాషలో మాట్లాడాలని, బూతులు వాడకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు.

