Andhra Pradesh

అచ్యుతాపురం సెజ్‌‌లో విషవాయువు లీక్

Share with

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విషవాయువు లీకై కలకలం సృష్టించింది. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీని కారణంగా అక్కడ పనిచేస్తున్న దాదాపు 150 మందికి పైగా మహిళా ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరు ఫ్యాక్టరీలో వెలువడిన రసాయన వాయువు వల్ల వాంతులు, వికారంతో స్పృహ కోల్పోయారు. అయితే ఫ్యాక్టరీలో ఉన్న వైద్య సిబ్బంది వెంటనే అక్కడ ఉన్న వారిలో కొందరికి ప్రథమ చికిత్స అందించారు. మరి కొందరిని తక్షణమే ఫ్యాక్టరీ బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో సమీపంగా ఉన్న అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.పెద్ద సంఖ్యలో  మహిళలు వాంతులు,వికారంతో ఆర్తనాదాలు చేశారు. సంఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 4వేల మంది కార్మికులు పనిచేస్తుండగా వారిలో 150 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

ఇదే తరహాలో మే నెల మొదటి వారంలో కూడా గ్యాస్ లీక్ అవడంతో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సీడ్స్ దుస్తుల కంపెనీ సమీపంలోని పోరస్ లాబ్స్‌ను సుమారు వారం రోజుల పాటు మూసేవేసిన ప్రభుత్వం విచారణ జరిపింది. హైదరాబాద్ ఐఐసీటీ సహా ఇతర అధికారులతో రసాయన వాయువు లీకేజిపై నివేదికలు తీసుకున్న ప్రభుత్వం ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పటికీ వెల్లడించలేదు. ఆ సంఘటన మరువక ముందే మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం కంపెనీ అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. అయితే ఈ ఘటనలో అస్వస్థతకు గురైన మహిళ కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హాస్పిటల్‌లో 53 మంది, ప్రైవేటు హాస్పిటల్‌లో 38 మంది మహిళా కార్మికులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది వాంతులు,ఆయాసం,తలనొప్పి వంటి లక్షణాలు కలిగి ఉన్నారని వైద్యులు తెలిపారు. బాధితుల్లో అవసరం అయిన వారికి ఆక్సిజన్ పెట్టి వైద్యం అందిస్తున్నామని వైద్యులు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో బాధితలను పరామర్శించేందుకు పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎన్టీఆర్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అమర్‌నాథ్  అక్కడ ఉన్న బాధితులను పరామర్శించారు. వారికి అందించే చికిత్స విధానం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అంతేకాకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు ప్రమాదం ఎలా జరిగింది? ఈ విషవాయువులు ఎక్కడి నుండి వెలువడ్డాయి అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. బాధితులు తక్షణ సహాయం కోసం 08924-222888 నెంబర్‌కు డయల్ చేయవలసిందిగా అధికారులు సూచించారు.

ఈ ఘటనపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ..సీడ్స్ యూనిట్ 121లో ఉన్న కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. 2నెలల క్రితం కూడా ఇలాంటి సంఘటన జరిగిందన్నారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన వారిని 5 హాస్పిటల్స్‌లో జాయిన్ చేశామన్నారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. ఆ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం లేదని చెప్పారు. అయితే ఇటువంటి సంఘటన జరగటం దురదుష్టకరమన్నారు. గతంలో జరిగిన ప్రమాదంపై ఒక కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ అందులో కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో తెలిపిందన్నారు. ఆ సంఘటనపై  ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు. గత ప్రమాదంపై కంపెనీకి నోటీసులు ఇచ్చామని… అంతేకాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించామన్నారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన రూట్ కాజ్ తెలిసే వరకు సీడ్స్ కంపెనీని తక్షణమే మూసేస్తామన్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలన్నారు.ఈ ప్రమాదంపై విచారణకు ఐసీఎమ్మార్‌కు పంపుతామన్నారు. బాధితులకు ఎంత ఖర్చైన ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ఉన్న అన్ని పరిశ్రమలపైన సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తున్నామన్నారు.