ప్రమాదంలో ప్రధాని భద్రత… ఏపీ పర్యటనలో ఘటన
ప్రధాని మోదీ పర్యటనలో అపశృతి చోటుచేసుకొంది. ప్రధాని చాపర్ గాల్లో ఎగురుతున్న సమయంలో… బ్లాక్ బెలూన్స్ ఎగురువేయడంతో భద్రత ప్రమాదంలో పడింది. మోదీ వెళ్లిన ఐదు నిమిషాల తర్వాత… ఎయిర్ పోర్టుకు నాలుగున్నర కిలో మీటర్ల దూరంలో రెండు బెలూన్లు ఎగురవేశారని పోలీసులు తెలిపారు. ఏపీలో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోదీ చాపర్ గాల్లోకి ప్రవేశించిన కొద్దిసేపటికి ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు కొందరు దురుద్దేశపూర్వకంగా ఈ పనిచేసినట్టు తెలుస్తోంది.
నలుగురు కాంగ్రెస్ కార్యకర్తల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్ బెలూన్లు చూపించి ప్రధాని మోదీని వ్యతిరేకించాలని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. ప్రధాని రాక ముందు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో సుంకర పద్మశ్రీ, పార్వతి, కిషోర్ అనే ముగ్గురు వ్యక్తులు బెలూన్‌లతో విమానాశ్రయం వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఐతే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రధాని మోదీ విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాల తర్వాత ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు రాజీవ్ రతన్, రవి ప్రకాష్ నిర్మాణంలో ఉన్న భవనంపైకి ఎక్కి బెలూన్‌లను ఎగురేశారు. రవి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజీవ్ రతన్ కోసం గాలిస్తున్నారు.