తెలుగువారి నిండుసంతకం అల్లూరి-మోదీ నీరాజనాలు
తెలుగువీర లేవరా… దీక్షబూని సాగరా అంటూ స్పీచ్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ… దేశానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పుణ్య భూమి, వీర భూమి అని మోదీ కొనియాడారు. అల్లూరి జయంతి ఉత్సవాల సందర్భంగా స్మరించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. భారతదేశం మొత్తం తరుపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నానన్నారు మోదీ. త్యాగాలను స్మరించుకొని ముందుకు సాగాలన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంశ్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మంత్రి రోజాతోపాటు, అల్లూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం జగన్. పోరాటయోధుల్లో మహా అగ్నికణం అల్లూరి అంటూ జగన్ కొనియాడారు. తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదా అల్లూరి అన్నారు. అల్లూరి త్యాగం ప్రతి మనిషి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

భావితరాలకు అల్లూరి త్యాగం గురించి తెలియాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పులిబిడ్డగా… అల్లూరి తెలుగువాడి పౌరుషాన్ని చూపించారన్నారు. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రావాలని కోరిన వెంటనే మోదీ వచ్చారన్నారు కిషన్ రెడ్డి.